అతిచిన్న ల్యాప్‌టాప్‌

చైనాకు చెందిన మ్యాజిక్‌ బెన్‌ సంస్థ మ్యాగ్‌1 పేరుతో ప్రపంచంలోనే అతిచిన్న ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. దాదాపు A5 కాగితమంత పరిమాణంలో ఈ ల్యాప్‌టాప్‌ ఉంటుంది. ఎనిమిది అంగుళాల వెడల్పు, ఐదున్నర అంగుళాల ఎత్తు దీని పరిమాణం. బరువు కేవలం 700 గ్రాములు. అయినప్పటికీ యాపిల్‌ ల్యాప్‌టాప్‌, మ్యాక్‌బుక్‌ కంటే ఎక్కువ పోర్టులు ఇందులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ అల్ట్రా పోర్టబుల్‌ ల్యాప్‌టాప్‌లో టచ్‌ ప్యాడ్‌ కలిగి ఉంది. యూఎస్‌బీ 3.0 పోర్ట్‌, టైప్‌ సీ కనెక్టర్‌, మైక్రోఎస్‌డీ కార్డ్‌ రీడర్‌, ఆడియో సాకెట్‌, మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. దీని డిస్‌ప్లే టచ్‌ స్క్రీన్‌ కావడం మరో ప్రత్యేకత. పేరుకు అత్యంత చిన్న ల్యాప్‌టాప్‌ అయినప్పటికీ, 30 ఏహెచ్‌ఆర్‌ బ్యాటరీ సామర్థ్యం కలదని కంపెనీ తెలిపింది. దీని ధర సుమారు రూ. 56వేలుగా ప్రకటించారు.